స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొందరు నేతలు కలెక్టరేట్ కార్యాలయంలోకి చోచ్చుకుపోగా, రెండో గేటు వద్ద పోలీసులు వారిని పూర్తిగా అడ్డుకున్నారు. అనంతరం, కలెక్టరేట్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను అదుపులోకి తీసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఏ రంగంలో చూసినా దౌర్భాగ్యమైన స్థితిలో ఉందన్నారు. ప్రజలను అణిచివేతకు గురిచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చామని నిరసనకు దిగితే, దేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో పోలీసులు నిర్బంధ వ్యవస్థ ఉందన్నారు.
ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తుందన్నారు. కాబోయే సీఎం కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో పోలీసు నిర్బంధ మరీ ఎక్కువగా ఉందన్నారు. ఏ ఆశయం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, సీఎం కేసీఆర్ ఒక్క ఆశయాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు కొలగొట్టిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్, మాట తప్పాడని ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.