జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తీసుకెళ్తున్న వాహనాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అంతకుముందు.. హనుమకొండలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రమా చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆరూరి… ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వచ్చారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు.ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేముందు ఆరూరి రమేష్‌ను బీఆర్ఎస్ నేతలు ఇంట్లోకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు చెప్పారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. పార్టీకి రాజీనామా చేయ వద్దని బీఆర్ఎస్ నేతలు ఇంకా ఆరూరి రమేష్‌ను బుజ్జగిస్తున్నారు. మరోవైపు ఆరూరి బీజేపీలో చేరుతు న్నట్లు ప్రచారం జరుగుతోంది.