స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: భక్తుల ఆలనాపాలనా చూసుకునే అధికారులు తప్పులు చేస్తున్నారు. దేవతా మూర్తుల నిత్య కైంకర్యాలు చూసుకోవాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. నన్ను ఎదిరించే దమ్ము ఎవరికుంది.. నేను ఆడిందే ఆటా.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు దేవాలయ అధికారులు. ఇలాంటి ఘటనే తాజాగా నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రసిద్ధ నీలకంఠేశ్వర ఆలయ పుష్కరిణిలో.. స్వామివారికి ఓ వైపు చక్రస్నానాన్ని వైదిక అర్చకులు నిర్వహిస్తుండగా..మరోవైపు పుష్కరిణిలో దిగి ఆలయ ఈవో వేణు ఈతకొడుతూ జల్సాలు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామి వారికి చక్రస్నానం నిర్వహించారు. అదే సమయంలో ఆలయ ఈవో వేణు ఈత కొట్టడంతో పలువురు భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. పవిత్ర పుష్కరిణిలో ఇలా ఈత కొడుతూ అపచారం చేయడం ఏంటని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో గత నాలుగు రోజులుగా వైరల్ గా మారింది. ఈ విషయంపై స్పందించిన దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రియ శుక్రవారం ఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.