స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో భానుడి భగభగలు ఆగడం లేదు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఎండలు ఠారెత్తించనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈ మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏర్పడతాయని.. అత్యధికంగా 43డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా జూన్ ఒకటి నుంచి 5 రోజులపాటు 44డిగ్రీల ఉష్ణోగ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండంతోపాటు పొడి వాతావరణమే ఎండల పెరుగుదలకు కారణమని వెల్లడించారు.
అటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు 97 మండలాల్లో వడగాల్పులు, రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 43.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.7డిగ్రీలు, చిత్తూరు జిల్లా నింద్రలో 43.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు.