స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో ముఖ్యమంత్రి జగన్ ను, ఇతర మంత్రులను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు.
ఈ ఉదయం ఎయిర్ ఏషియా విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన 10.05 గంటలకు విశాఖకు చేరుకున్నారు. పావు గంట తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయన తన కారు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఆయనను చుట్టుముట్టి, బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. అయ్యన్నను బలవంతంగా అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.