స్వతంత్ర, వెబ్ డెస్క్: ఇటీవల అమెరికాలో మరణిస్తున్న తెలుగు వారి సంఖ్య ఎక్కువైపోతుంది. దుండగుల కాల్పుల్లోనో, ప్రమాదాల్లోనో ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు వదిలేస్తున్నారు. ఉన్నత భవిష్యత్ కోసం ఉన్న దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెళ్తున్న వారు అటు నుంచి అటే అనంతలోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా మరో తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేశ్(25) మాస్టర్స్ ఆఫ్ బయో మెడికల్ కోర్సు చదవడానికి గత సెప్టెంబరులో అమెరికా వెళ్లారు.
న్యూజెర్సీలోని ఓ కాలేజీలో చదువుతున్నారు. అయితే శనివారం కారులో వెళ్తుండగా మరోవైపు నుంచి వచ్చిన కారు నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొంది. దీంతో శైలేశ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యారు. శైలేశ్ అకాల మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వయసులో అండగా నిలబడతాడనుకున్న కొడుకు ఇలా పరాయి దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లితండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


