స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఉత్సవాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటేలా ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణం కనిపించాలని ఆదేశించారు.
జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు. సచివాలయంలో తొలి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయని అదే రోజున మంత్రులు జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడట్టాలన్నారు. కాగా 2014 జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 2023 జూన్ లో పదో వసంతంలోకి అడుగు పెట్టనుంది. దేశంలోనే అతి పిన్న వయసు రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిని చూసి ఉత్తరాది రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.


