TSPSC Paper Leak Case | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన వెనుక అసలు సూత్రధారులెవరు? పాత్రధారులెవరనే విషయం ఇంకా తెలియరాలేదు. సిట్ అధికారులు మాత్రం వేగంగా విచారణ చేస్తున్నామంటూ.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి స్టేట్‌మెంట్ సైతం రికార్డు చేశారు. ఇదిలా జరుగుతుండగానే.. మరోవైపు సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు మొదలైన తొలిరోజే పేపర్ల లీకేజీ వ్యవహరం రెండు రాష్ట్రాల్లో పెను దుమారాన్నే లేపింది. గత ఏడాది కూడా పేపర్ల లీకేజీ వ్యవహరం బయటకు రావడంతో ఈ ఏడాది పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని రెండు రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో అయితే సమస్యత్మాక ప్రాంతాల్లో నిఘా కెమెరాలు సైతం ఏర్పాటు చేసినా.. పేపర్ లీకేజీని ఆపలేకపోయారు. అసలు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అక్రమాలను నియంత్రిచలేకపోతుండటంతో.. పేపర్ లీకేజీ ఘటనలు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేపర్ లీకేజీ తతంగం ఒక ఎత్తైతే.. అసలు ఈ లీకేజీలకు వెనుక ప్రధాన సూత్రధారులెవరు.. పాత్రధారులెవరనేది అసలు ప్రశ్న.. టీఎస్‌పీఎస్సీ పరీక్షా ప్రశ్నాపత్రాలంటే.. అవి ఉద్యోగానికి సంబంధించినవి కావడంతో.. లీకేజీ చేయడం.. వాటిని విక్రయించి డబ్బులు సంపాదించుకోవడం, ఇతర కారణాల దృష్ట్యా జరిగిందనుకుంటే.. మరి ఉద్యోగాలతో సంబంధం లేని పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాలు.. పరీక్ష ప్రారంభం కాకముందే బయటకు రావడం, జెరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు కన్పించడం, వాటి జవాబులను జిరాక్స్ తీయించి.. పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులకు అందజేస్తున్నారు.
TSPSC Paper Leak Case |పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక మర్మం ఏమిటని చూస్తే.. సాధారణంగా ప్రయివేట్ స్కూల్స్ మధ్య పోటీ ఎక్కువుగా ఉంటుంది. ఏ పాఠశాలలో అయినా బాగా చదివే విద్యార్థులు కొంతమంది మాత్రమే ఉంఆరు. వారికి వచ్చిన మార్కులను విద్యాసంస్థలు ప్రచారం చేసుకుంటూ.. గొప్పలు చెప్పుకుంటాయి. ఇదే సమయంలో ఇటీవల కాలంలో ప్రయివేట్ పాఠశాలల విద్యార్థుల్లో ఫెయిల్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ఈ క్రమంలో కొంతమంది ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు పరీక్షల పేపర్‌కు జవాబులు తయారు చేయించి.. వాటిని విద్యార్థులకు అందజేస్తోంది. ఈ వ్యవహరం వెనుక సూత్రధారులు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలైతే.. పాత్రధారులు మాత్రం వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు లేదా సిబ్బంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఉత్తీర్ణత విషయంలో టార్గెట్స్ విధిస్తుండటంతో.. ప్రయివేట్ పాఠశాలల పేపర్ లీకేజీలో వీరు భాగస్వాములవుతున్నారు. తమ పాఠశాల విద్యార్థులకు ఈ జవాబులు ఇవ్వవచ్చనే ఉద్దేశంతో పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఏపీలో సీఎం సొంత జిల్లా కడపలో పేపర్ లీకేజీ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి ఈ ఘటనతో సంబంధం లేకపోయినప్పటికి.. ప్రభుత్వ అధినేతగా ఆయన విమర్శలు ఎదుర్కొవల్సి వస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వానికి ఓ ఎదురుదెబ్బగా పేపర్ లీకేజీ ఘటనను చెప్పుకోవచ్చు. తెలంగాణలోని తాండూరులో సైతం పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందనే ప్రచారం సాగింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తీర్ణత శాతం పెంచుకోవడం కోసం కార్పోరేట్, ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ వెనుక ప్రధాన సూత్రధారులనే విషయం స్పష్టమవుతుది. మరోవైపు ప్రయివేట్ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా.. ప్రశ్నాపత్రాలు త్వరగా బయటకు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ పేపర్ లీకేజీ ఘటనపై ఇరు రాష్ట్రరాల ముఖ్యమంత్రులు స్పందిస్తారా లేదో వేచి చూడాలి.