MLC Kavitha | మెడికో ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. సోదరి ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని లేఖలో పేర్కొన్నారు. ఒక తల్లిగా తాను ఎంతో వేదనకు గురయ్యానని.. ప్రీతి(Preethi) కోలుకోవాలని కోరుకున్న కోట్లాది మందిలో తానూ ఒకరినని తెలిపారు. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆమెకు ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. కడుపుకోత అనుభవిస్తున్న మిమ్మల్ని ఎంత ఓదిర్చినా అది చాలా తక్కువే అవుతుందన్నారు. ఏ తల్లిదండ్రులకు కూడా మీలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాని వ్యాఖ్యానించారు.
కూతురిని కోల్పోయి మీ కుటుంబానికి బీఆర్ఎస్(BRS) పార్టీ అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు. ప్రీతి మరణానికి కారణమైన దోషులను వదిలిపెట్టబోమని లేఖలో వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని కవిత(MLC Kavitha) పేర్కొన్నారు.