స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలో తమకు కొత్త అప్షన్ వచ్చిందని సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో మోదీకి ఘోర పరాభవం జరిగిందని.. ఇకపై జనాల్లోకి రారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే మోదీ లౌకిక దేశానికి ప్రధానిగా అనర్హుడని విమర్శించారు. దక్షిణ భారతదేశం నుంచి బీజేపీని ప్రజలు పూర్తిగా వెళ్లగొట్టారన్నారు. కర్ణాటక ఫలితాలు దేశానికి దిక్సూచి అని వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ సన్యాసం తీసుకోలేదని, తమక్కూడా సీట్లు కావాలన్నారు. తమతో కలిసి ఉంటున్న సీఎం కేసీఆర్ జాయింట్ యాక్షన్ లోకి మాత్రం రావడం లేదని.. కొన్ని రోజులు వేచిచూస్తామన్నారు. ఆ తర్వాత తాము ప్రత్యామ్నాయం చూసుకుంటామని నారాయణ వెల్లడించారు.