రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలే కాకుండా మన నేటివిటీని, మన ఆచార సంప్రదాయాల్ని చూపించే చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా రావడం లేదు. కానీ మన ఆచార, సంప్రదాయాలు, మన సంస్కృతిని చాటేలా, మన ఇతిహాసగాథలైన రామాయణం నుంచి ప్రేరణపొంది ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమాను సతీష్ పరమవేద తెరకెక్కిస్తున్నారు.
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చిత్రయూనిట్ వెళ్లింది.
సీఎం రేవంత్ రెడ్డికి చిత్ర టీజర్, ట్రైలర్‌ను చూపించారు. సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్‌ను వీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ చిత్రయూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయని సినిమా పెద్ద హిట్ అవ్వాలని, యూనిట్‌కు మంచి పేరు రావాలని అన్నారు. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నిర్మాత రాచాల యుగంధర్, డైరెక్టర్ సతీష్, నీరూస్ ప్రతినిధి అసీమ్, నటీనటులు సుమన్ తేజ్, గరీమ చౌహాన్, గగన్ విహారి కెమెరామెన్ పరశురామ్ తదితరులు ఉన్నారు.