స్వతంత్ర, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(44), అజింక్య రహానే(20) ఉన్నారు. భారత్ ఛాంపియన్‌గా నిలవాలంటే చివరి రోజు ఆటలో మరో 280 పరుగులు చేయాలి. టీమిండియా కనుక చివరి వరకు పోరాడి టార్గెట్ ఛేదిస్తే 444 పరుగులను ఛేజ్ చేసిన జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. అదే ఆస్ట్రేలియా విజయానికి అయితే 7 వికెట్లు కావాలి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలో రోహిత్ సేన ఆది నుంచే ధాటిగా ఆడటం మొదలుపెట్టారు. అయితే అంపైర్ల వివాదాస్పద నిర్ణయానికి ఓపెనర్ శుభ్‌మన్ గిల్(18) ఔటయ్యాడు. బోలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో కామెరూన్ గ్రీన్ అందుకున్న క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. అయితే టీవీ రిప్లైలో బంతి గ్రౌండ్‌కు టచ్ అవుతున్నట్లు కనిపిస్తున్నా.. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ అని ప్రకటించాడు. ఇక హిట్టింగ్ చేస్తూ జోరు మీదున్న రోహిత్ శర్మ(43) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే పుజారా(27) కూడా ఔట్ అవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే తర్వాత వచ్చిన కోహ్లీ, రహానే ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్కాట్ బోలాండ్, లియాండ్ తలో వికెట్ తీశారు. మరి ఐదో రోజు ఆటలో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.