యుద్ధంలో గెలుపొందాలంటే సరైన సైన్యం ఉండాలి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే సమర్థులైన అభ్యర్థులను బరిలో దింపాలి. ఈ కోవలోనే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ-జనసేన కూటమి.. ఆ దిశగా తొలి అడుగు వేసిందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఉమ్మడిగా పోటీ చేస్తున్నఈ రెండు పార్టీలు.. ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. మొత్తం 118 మందితో తొలి విడుత కేండిడేట్ల లిస్ట్‌ను ప్రకటించాయి రెండు పార్టీలు. మొత్తం 99 మందితో అసెంబ్లీకి తొలి జాబితా ప్రకటించగా.. ఇందులో 94 టీడీపీకి, 5 జనసేనకు కేటా యించారు. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో 19 సీట్లను పెండింగ్‌లో ఉంచారు.
త్వరలోనే బీజేపీతో పొత్తు కురుతుందని ఇరు పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో మరికొన్ని సీట్లను పెండింగ్‌లో ఉంచారు. అయితే…టీడీపీ-జనసేన ప్రకటించిన తొలి విడత జాబితాపై ఫ్లాష్ సర్వే చేసింది స్వతంత్ర టీవీ. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అధికార వైసీపీని ఢీకొట్టే విషయంలో టీడీపీ-జనసేన కూటమి ఆచితూచి అభ్యర్థుల్ని ప్రకటించారన్న అంశం ఫ్లాష్ సర్వేలో వెల్లడైంది. వైసీపీ నేతలను సమర్థంగా ఎదుర్కొంటూనే ప్రజల్లో తమ ప్రభావం చూపే నేతలు, విజయం సాధించే నేతలను ఏరి కోరి మరీ టీడీపీ జనసేన పార్టీలు బరిలో దింపాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక మూడు నాలుగు స్థానాల్లో మినహా మిగిలిన అభ్యర్థులందరి విషయంలో ప్రజలు, ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో 95 శాతం మంది తప్పక గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి జాబితాలోనూ ఇదే మాదిరిగా ప్రకటిస్తే గతంలో వైసీపీ సాధించిన సీట్ల కంటే ఎక్కువ సాధిస్తారని చెప్పుకొస్తున్నారు.


