తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్(BJP-TRS) పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలకు సీఎం కేసీఆర్(CM KCR) ప్రోటోకాల్ పాటించడం లేదు. రాజకీయ సిద్ధాంతాల పరంగా ఎన్ని విభేదాలున్నా ఏదైనా రాష్ట్ర పర్యటనకు ప్రధాని వచ్చినప్పుడు ఆ రాష్ట్ర సీఎం స్వాగతం పలకడం అనేది అనవాయితీగా వస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఈ అనవాయితీని పాటించడం లేదు. ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు సాదరంగా స్వాగతించడానికి ఆయన వెళ్లకుండా తన తరపు మంత్రులను ప్రతినిధులుగా పంపిస్తున్నారు. దీంతో కేసీఆర్ వ్యవహారశైలిపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM STALIN) వ్యవహారశైలిపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. బీజేపీ-డీఎంకే(BJP-DMK) పార్టీల మధ్య కూడా రాజకీయ వైరం ఉంది. కేంద్ర ప్రభుత్వం విధానాలపై ఆ పార్టీ అధినేత స్టాలిన్ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయినా కానీ శనివారం ప్రధాని మోదీ(PM MODI) తమిళనాడు పర్యటన నిమిత్తం చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకోవండతో సీఎం హోదాలో ఆయనకు శాలువా కప్పి సాదర స్వాగతం పలికారు. దీంతో కేసీఆర్ పై మరింత విమర్శలు ఎక్కువయ్యాయి. స్టాలిన్ కు లేని ఇబ్బంది కేసీఆర్ కు ఏంటని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.