తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే నిరుద్యోగుల మిలీనియం మార్చ్ ఢిల్లీలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) సవాల్ విసిరారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ 9సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 1.35లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని.. మరో 90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.
దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసి రాజ్యాంగ నిర్మాతకు సీఎం కేసీఆర్(KCR) నిజమైన గౌరవం కల్పించారని కొనియాడారు. కేంద్ర నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం చేతకాని బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. నాలుగు సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి(KishanReddy) రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు.