మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్టు చోటుచేసుకుంటుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ నరసింహ ధర్మాసనం.. అవినాశ్ కి బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. హైకోర్టు ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అయితే హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఆయన తరపు లాయర్లు వాదించారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. పూర్తి స్థాయి విచారణ సోమవారం చేపడతామని తెలిపింది.