స్వతంత్ర వెబ్ డెస్క్: అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ఈ నెల 11న విచారించనున్నట్లు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ బేలా, ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించనుంది. విచారణ కోసం నెంబర్ 41కింద కేసులు లిస్టు అయ్యాయి. ఇది వరకు ఈ కేసులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మానసం విచారించింది. చివరిసారిగా ఈ కేసులను ఆ ధర్మాసనం మే 17న విచారించింది. తాను జూన్ 16న పదవీ విరమణ చేయబోతున్నందున ముఖ్యమైన ఈ కేసులను విచారించి తీర్పు వెలువరించే సమయం లేదన్న కారణంగా జస్టిస్ కేఎం జోసెఫ్ జూలై 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అమరావతి రాజధాని కేసులు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు వచ్చాయి.
ఇక మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఎన్నికల అజెండాలు ఫిక్స్ చేస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోంది. టీడీపీ, ప్రతిపక్షాలు అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ నెల 11న సుప్రీంకోర్టు అమరావతి పైన విచారణ చేపట్టనుంది. ఈ మరుసటి రోజునే ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో, ఉత్కంఠ పెరుగుతోంది. వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా తన పాలన సాగుతుందని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. ఈ నెల 11న సుప్రీంలో విచారణ ఉండగా, 12న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సుప్రీంలో జరిగే విచారణ మరుసటి రోజునే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయటం ఆసక్తి కరంగా మారుతోంది. కోర్టు తీర్పు ఆలస్యం అయితే ముఖ్యమంత్రిగా ఎక్కడి నుంచి అయినా పాలన చేసేందుకు ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం పైన కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు అమరావతి వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలో సుప్రీంకోర్టు విచారణ..కేబినెట్ నిర్ణయాల పైన ఆసక్తి పెరుగుతోంది.