ఎన్నికల బాండ్ల వ్యవహారంలో భారతీయ స్టేట్ బ్యాంకు పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది.
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని అప్పట్లో ఎస్‌బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఈ నెల 13లోగా బహిరం గపరచాలని ఈసీకి స్పష్టంచేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని తాము ఆదేశించామ న్నారు. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ రావడం చాలా తీవ్రమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తీర్పు స్పష్టంగా ఉందన్నారు. గత 26 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎస్‌బీఐ వెంటనే ఆ వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.


