స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణాలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన వస్తోంది. వైన్ షాపులను(Wine shop) దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఎంతగా అంటే.. కేవలం మూడు రోజుల్లోనే రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అసలే ఎన్నికల సమయం (Election time) దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు గిరాకీ మామూలుగా ఉండదు. దీంతో.. ఈసారి మద్యం దుకాణాలను దక్కించుకుంటే.. ఇక కాసుల వర్షమే అని చాలా మంది భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే టెండర్ (Tender) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అందులో ప్రధానంగా.. రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి విశేష స్పందన వస్తోంది. తెలంగాణలో మొత్తంగా 2 వేల 620 మద్యం దుకాణాలకు గానూ.. మంగళ వారానికి (ఆగస్టు 8) 2000 కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. ఒక్కో అప్లికేషన్‌కు నాన్‌రీఫండెబుల్ ఫీజు కింద 2 లక్షలు చెల్లిస్తుండగా.. వీటి ద్వారా ఇప్పటివరకు సర్కారు ఖజానాకు సుమారు రూ.40 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది.
2023-25 సంవత్సరాలకుగాను తెలంగాణలోని మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుండగా.. కొత్త లైసెన్సుల(New licenses) కోసం ఈ నెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు.. దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో.. ఎక్కువగా పొలిటికల్ లీడర్లు.. వాళ్ల అనుచరులే దరఖాస్తులు చేసుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.