పాములు, కాటులు, పగబట్టడాలు వగైరా…వగైరా డేంజర్ తంతులేమీ లేకుండా…రోజుకు కొంత పాము విషాన్ని మందులా సేవించి…సర్ప గరళంతో కాయం అంతా విషమయం చేసేసుకోవడం, ఇక ఎంత భయంకర సర్పం కాటేసినా.. ఆ కాటు.. చెల్లని నోటుగానే మారుతుందనే సందేశం ఓ సర్పచిత్రంలో కన్పిస్తుంది. అయితే, ఆ పరంగా సర్ప కాట్ల నుంచి రక్షింపబడినా.. సమాజానికి ఆ వ్యక్తి దూరం అవ్వడం, సర్ప మనస్థత్వం, పాము పద్దతులు రావడం ఆ సినిమాలో చూపిస్తారు, అది వేరే విషయం. అయితే, ఈ స్టోరీకి… చిత్తూరు జిల్లాకు చెందిన సర్పదేవుడు పేరున్న సుబ్రహ్మణ్యం పాము కాట్ల స్టోరీకి సంబంధం ఏమీ లేకపోయినా…ఆయన ఇప్పటి వరకు ఎదుర్కొన్న పాము కాట్లు సెంచరీ దాటిపోయినా మృత్యుంజయుడిగానే మిగిలిపోయారు.
పాములు పగబట్టే కాటేస్తున్నాయో, ప్రమాదవశాత్తే పాముల బారిన పడుతున్నాడో తెలియదు కాని…. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. అయితే, పాము కాట్లకు గురవ్వడం, ఆసుపత్రుల్లో చికిత్స పొందడం, నిక్షేపంలా ఇంటికి రావడం..ఈ తంతు, సంతలోని వింతలా కనిపిస్తున్నా…అక్షరాల నిజం అని సుబ్రహ్మణ్యం, ఆయన కుటుంబ సభ్యులేకాక, ఊరి ప్రజలు చెబుతున్నారు.
నిరుపేద కూలీ సుబ్రహ్మణ్యం కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆయన్ను వదలకుండా పాములు వెంటాడుతూ కాటేస్తూ ఉండటం సంచలనంగా మారింది. 18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉన్నప్పుడు తొలిసారి సుబ్రహ్మణ్యం పాముకాటుకు గురయ్యాడు. అంతే, అప్పటి నుంచి పాముకాట్ల పరంపర సాగుతూనే ఉంది. ఏ సర్ప దోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
సుబ్రహ్మణ్యం ఏ పొలంలో ఉన్నా, ఎక్కడ పనిచేస్తున్నా.. ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదు కాని వెతుక్కుంటూ వచ్చినట్టు పాములు వచ్చేసి, హఠాత్తుగా కాటేసి, వెంటనే ఏ పుట్టల్లోకో, పాతళ లోకానికో, సర్పలోకానికో చెక్కేస్తున్నాయి. నాగుపాము, కట్లపాములేకాక, కర్కోటక, తక్షక, రక్త పింజర…ఇలా ఏ సర్పజాతికి చెందిన పాములో తెలియదు కాని, పాము కాట్లకు గురికావడం, నానా పాట్లు పడడం, ఆసుపత్రి ఇక్కట్ల అనంతరం కోలుకుని ఇంటికి చేరడం.. ఇలా భేతళ కధ మాదిరి తయారైంది సుబ్రహ్మణ్యం పాము కాట్ల వ్యవహారం.
సుబ్రహ్మణ్యం వ్యవహారం తమ సర్పజాతికే అవమానం అని తల్చిందో ఏమో కాని.. లేటెస్ట్ గా ఓ పాము పిల్ల.. సుబ్రహ్మణ్యంపై కసిగా కాటేసింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామం సమీపంలోనే ఉన్న కోళ్ల ఫారం లో పని కోసం వెళ్లిన సుబ్రహ్మణ్యం ను పాము కాటేసింది. అయితే, పెద్దపంజాణి మండలం శివాడి గ్రామ సమీపంలోని జెఎంజె మిషనరీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న సర్పంజయుడు, తిరిగి మృత్యుంజయుడిగా ఇంటికి చేరుకున్నాడు. అయితే, అస్తమాను పాము కాట్లు, ఆసుపత్రుల చుట్టూ తిరగడాలతో పేద కుటుంబానికి చెందిన సుబ్రహ్మణ్యం విపరీతంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలను పోషించడానికే నానా అవస్థలు పడుతుంటే, ఈ పాములేమిటో, పగపట్టడాలు ఏమిటో, కరవడాలు ఏమిటో, ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఇళ్లకు రావడాలు ఏమిటో.. ఏమీ అర్థం కావడం లేదని సుబ్రహ్మణ్యం కుటుంబీకులు వాపోతున్నారు. సుబ్రహ్మణ్యంనే పాములు ఎందుకు కాటేస్తున్నాయో తెలియక కుటుంబసభ్యులు తలలు పట్టుకుంటున్నారు
సుబ్రహ్మణ్యం పరిస్థితి ఎలా ఉందంటే…బయట నుంచి లోపలకి వస్తూ, కాస్త అలసటగా కనిపిస్తే.. ఎక్కడ ఏ పాము కరిచింది అని అడిగే కుటుంబ సభ్యులు, చిన్న జ్వరం వచ్చి ఆసుపత్రిలో అడుగెట్టినా… పాము ఎక్కడ, ఎలా కరిచింది అనే ఆసుపత్రి సిబ్బంది, ఊళ్లోకి వెళితే.. పామేమీ కరవ లేదా అని కుశల ప్రశ్నలు.. సుబ్రహ్మణ్యానికి తిక్క రప్పించేస్తున్నాయని గ్రామీణ జనాలు అనుకుంటున్నారు. అయితే, కొంతలో కొంత నయం… ఆసుపత్రి యాజమాన్యాలు సర్పబాధితుడిపై కనికరం కల్గి.. స్వల్పంగానే వైద్య ఖర్చులు తీసుకుంటూ.. ఆయన ప్రాణాలను నిలబెడుతున్నారు.
సుబ్రహ్మణ్యాన్ని పాములు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి.. ఎందుకు అన్ని సార్లు కాటేశాయి ..? ఎన్నిసార్లు కాటేసినా ప్రాణాలు ఎలా నిలబెట్టేసుకుంటున్నాడు.. అనేది అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది. సర్పం, భుజంగం, ఫణి, నాగమణి, నాగు, నాగిని, సుబ్రహ్మణ్యం.. ఇవన్నీ సర్పదేవుడు, సర్పదేవతల పేర్లు. తమ పేరు పెట్టుకుంటే సంతోషం వ్యక్తం చేయాలికాని.. సుబ్రహ్మణ్యంపై అంత పగపట్టడం ఏమిటని, కాట్ల మీద కాట్లు వేసి.. ఆ అమాయకుడిని నాగజాతి నానా అగచాట్లకు గురిచేయడం ఏమిటని గ్రామస్థులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ సర్పబాధితుడి పురాకృత ప్రారబ్దమో, అయాచితంగా, అనుకోకుండానే ఈ పాముకాట్ల ఘటనలు జరుగుతున్నాయో తెలియదు కాని.. దీని మీద పుంఖాను పుంఖాన్లుగా కథలు వచ్చేస్తున్నాయి. రచ్చబండల మీద కూర్చుని గ్రామస్థులు.. చందమామ కథల్లో పూర్వపు నాగ గాథలు, నాగలోక సినిమా ఘట్టాలు… ఎన్నో, ఎన్నింటినో గుర్తుచేసేసుకుని చర్చలు చేసేసుకుంటున్నారు.
తన తండ్రి పరీక్షిత్ ను పాము కాటేసి ప్రాణాలు తీసేసిందని జనమేజయుడు పాములు మీద కోపం తెచ్చేసుకుని, మొత్తం పాము జాతినే నిర్మూలన చేయడానికి సర్పయాగం చేశాడని భారతం చెబుతోంది. అయితే, సర్పంజయుడు సుబ్రహ్మణ్యం మాత్రం.. ఏకంగా 105 సార్లు 105 పాములు కాటేసేసినా..వాటిని పల్లెత్తు మాట అనలేదు. ఏ ప్రతీకార చర్య తీసుకోలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 సార్లు పాము కాటుకు గురైన వ్యక్తి బతికి ఉండడం ఎలా సాధ్యం…ఇది కచ్చితంగా చోద్యమే అని కొందరు మెటికలు విరవడాలు, నోళ్లు నొక్కుకోవడాలు చేసినా.. ఇది నిజ్జంగా నిజమే అని తేలిపోయింది.
ఎంత కోపం వచ్చినా పాపానికి మాత్ర ఒడిగట్టకూడదు. ఇలా చేసిన ఓ గొప్ప మహారాజే.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అందుకే పెద్దలు అంటారు తన కోపమే తనకు శతృవు అని. మహాభారతం ప్రకారం పరిక్షిత్ మహారాజు చచ్చిన పామును కామ్ గా తపస్సు చేస్తుంటున్న రుషి మెడలో వేసి.. తన చావును కోరితెచ్చుకున్నాడు. అయితే, తన తండ్రి అకాల శాప మరణం తనయుడికి కోపం రప్పించేసింది. దీంతో, సర్పయాగం మొదలెట్టాడు. సర్పయాగంలో పాముల పేర్లు చెబుతూ స్వాహా.. అంటూ యజ్ఞం సాగుతోంది. ఇలా పాములన్నీ స్వాహా మంత్రంతో మంటల్లో పడి కాలిబూడిద అయిపోతున్నాయి.
తక్షకుడో, శిక్షకుడో.. ఏదో పేరున్న పెద్దపాము ప్రమాదం తప్పించుకోవడానికి సింహాసనం మీద కూర్చున్న ఇంద్రుడిని చుట్టేసుకుంది. ఇంద్రుడు అమరుడు కదా.. ఆయనకు మరణం లేదు కాబట్టి..తాను తప్పించేసుకోవచ్చని తక్షకుడు ప్లాన్ వేసి ఈ పని చేశాడు. అయితే, అక్కడ యాగంలో తక్షకాయస్వాహా అనగా….ఇంద్రుడి సింహాసనంతో సహా ఆ పాము.. జనమేజయుడు నిర్వహిస్తున్న యజ్ఞ అగ్నిగుండంలోకి రాబోయింది. జనమేజయునికి రుషుల్లో అగ్రగణ్యులు, పుణ్యపురుషులు నచ్చచెప్పి సర్పయాగం ఆపకపోతే ఇంద్రుడు సైతం భస్మీపటలం అయ్యేవాడే అని.. ఎన్నో భారత గాధలన్నింటినీ ఈ గ్రామస్థులు చెప్పేసుకుంటున్నారు. పాము కాటేసినా మృత్యుంజయుడిగా, సర్పంజయుడిగా మిగలవచ్చేనే ఐడియా అప్పట్లో వచ్చుంటే.. సర్పయాగాల పనే ఉండేది కాదేమో.. అని గ్రామస్థులు సరదా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇదంతా బాగానే ఉందికాని.. ఏ పాపం, పుణ్యం ఎరుగని… కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న సుబ్రహ్మణ్యంపై ఈ పాముల దాడి ఏమిటని..కొందరు గ్రామస్థులు తిరిగి వాస్తవంలోకి వచ్చి ఆవేదన చెందుతున్నారు.
———