స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడకముందే పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఎంఐఎం (MIM) చేతిలో బిఆర్ఎస్ కారు స్టీరింగ్ ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ (Tarun Chugh) అన్నారు. బుధవారం ఎల్బీనగర్ లోని రంగా రెడ్డి జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ (KCR)అవినీతి పాలన కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఆయుస్మాన్ భారత్ (Ayushman Bharat) 5 లక్షల స్కిమ్ పథకాన్ని కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కుటుంబపాలన దుష్టపాలన నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడేది కేవలం బీజేపీ ప్రభుత్వం అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు ‘బీ టీం’ అని, తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన ఘనత కేసీఆర్ దే అని ఆరోపించారు. రెండు సార్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు అధికారం ఇస్తే, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారన్నారు. దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పేదలకు ఎందుకు అదించడం లేదని ప్రశ్నించారు. కాగా, దేశంలో గ్రామగ్రామాన స్వతంత్ర సమరయోధులు, మరియు దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరజవానుల విగ్రహలను ప్రతిష్ఠిస్తామని తెలిపారు.