చదువుతో ఆటపాటల్ని ప్రోత్సహించడం మంచి పరిణామం: ప్రకాష్ రాజ్
చదువుతో పాటు ఆటపాటల్ని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రోత్సహించడం అభినందనీయమని ప్రముఖ సినీ నటులు, నిర్మాత ప్రకాష్ రాజ్ ప్రశంసించారు. హైదరాబాద్ మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అతిథులతో కలిసి బెలూన్స్ ఎగరవేసి వేడుకల్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో సెయింట్ ఆన్స్ కాలేజీ నుంచి 68 మంది టాప్ టెన్ లోపు ర్యాంకులలో ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడలు, సాంస్క్రతిక కార్యక్రమాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించటం మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు. దీనివల్ల మానసికంగా ధృడంగా ఉంటారు. పోటీ తత్వం పెరిగి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా విజయం సాధిస్తారని తెలిపారు.
రెండేళ్ల తర్వాత వార్షికోత్సవం జరగడంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సెయింట్ ఆన్స్ సంస్థల మదర్ జనరల్ ఆంథోనమ్మ ఆత్మీయ ప్రసంగం చేశారు. విద్యతో పాటు సాంస్క్రతిక, సాహిత్య క్రీడారంగాలకు సెయింట్ ఆన్స్ పెద్ద పీట వేస్తుందని అన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సెయింట్ మేరీస్ ఫార్మా కళాశాల డైరక్టర్ ఫాదర్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో విద్యార్థినులు రాణించేందుకు ఈ కళాశాల పునాదులు వేస్తుందని తెలిపారు.
గౌరవ అతిథిగా సభావేదికను అలంకరించిన సెయింట్ ఆన్స్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ అమృత మాట్లాడుతూ… సభ్యత, సంస్కారాలతో కూడిన విద్యను అందించడంలో సెయింట్ ఆన్స్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని పేర్కొన్నారు.

చివరగా ప్రిన్సిపల్ సిస్టర్ పుష్పలీల మాట్లాడుతూ సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాల ప్రగతిని వివరించారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థినులు దేశ విదేశాల్లో రాణిస్తున్నారని, రానున్న కాలంలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. గత సంవత్సరం 68 ర్యాంకులను సొంతం చేసుకొన్న ఘనత సెయింట్ ఆన్స్ కళాశాలకు దక్కుతుందని వివరించారు.
వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ప్రిన్సిపాల్ పుష్పలీల అతిథులతో కలిసి పురస్కారాలు అందించారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్క్రతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.