పాతబస్తీ ప్రజలు ఎంతాగానో ఎదురు చూస్తున్న కల నెరవేరబోతుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తారు…? ఏఏ మార్గాలను కలుపుకొని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు..? ఇంతకు ఎంత వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నారు..?
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు పెట్టబోతోంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉన్నాయి. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్‌స్టేషన్- మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్ నిర్మితమైంది. రోజూ వేలాదిమంది ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటోన్నారు. దీన్ని మరింత విస్తరించబోతోంది ప్రభుత్వం.
హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్ట్‌లో మరో అడుగు ముందుకు పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాతబస్తీకి మెట్రో మోక్షం లభించింది. ఈనెల 8న ఓల్డ్ సిటీలో 5.5 కిలో మీటర్ల మేర మెట్రో మార్గానికి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తారు.
హైదరాబాద్‌లో ఎల్బీనగర్-మియాపూర్, నాగోలు-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్‌ల మధ్య 69.2 కి.మీ. మేర కొన్నేళ్లుగా మెట్రోరైళ్లు నడుస్తున్నాయి. మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ మెట్రోరైలు సంస్థ దాదాపు 16 వేల కోట్లతో చేపట్టింది. అప్పట్లోనే పాతబస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికీ ప్రయ త్నాలు జరిగాయి. సర్వే కూడా చేశారు. ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని అప్పట్లో భావించారు. దీనిపై పాతబస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచీ నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేశారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తరువాత మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారిం చారు. ఇందులో భాగంగా పాతబస్తీకి మెట్రోరైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరా బాద్ మెట్రో రైలు అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎం ఆమోదించారు.
కొత్త లైను ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీ హవేలీ, ఏత్‌బార్ చౌక్, అలిజాకోట్ల, మీర్‌మొమిన్ దాయరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఏర్పాటు కానుంది. 5.5 కి.మీ. మేర మార్గంలో 4 స్టేషన్లు సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రోతో దాదాపు 1,100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 100 అడుగులు, స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణతో కలిపి ప్రాజెక్టుకు 2,000 కోట్ల వ్యయమవుతుందని అధికారులు ప్రకటించారు. రైల్వే లైను నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా..ఇంజినీరింగ్ ప్రణాళికలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా లైను నిర్మాణ ప్రాజెక్టును హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రోకే ఇస్తారా..టెండర్లను పిలిచి మరో నిర్మాణ సంస్థకు అప్పగిస్తారా అన్నది ఇంకా తేల లేదు.


