స్వతంత్ర వెబ్ డెస్క్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపాయలలో వైఎస్సార్ ఘాట్‌ను.. వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రికి ఆమె నివాళులు అర్పించారు. షర్మిల వెంట ఆమె తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. ఇవాళ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఖమ్మంలో షర్మిల కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరానికి చేరుకున్నారు. రక్తదానం చేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… పాలేరు నియోజకవర్గంలోనే పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే పాదయాత్ర ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. 4,000 కిలోమీటర్ల ప్రస్థానాన్ని పాలేరు గడ్డ మీదనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ నియోజక వర్గంలో ప్రతి గడపను కలుస్తానని చెప్పారు.
పాలేరు మట్టి సాక్షిగా, ఇక్కడి ప్రజలకు రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను అందిస్తానని షర్మిల హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలని ఉందని, తనను ఆశీర్వదించాలని కోరారు. తాను వైఎస్సార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు. వైఎస్సార్ ప్రతి వర్గాన్ని గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. ఆయన మంచి నాయకుడు కాబట్టే మహా నాయకుడు అయ్యారని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు ఈ దేశానికే ఆదర్శమని చెప్పుకొచ్చారు. ఇవాళ ఉదయం షర్మిల ఏపీలోని ఇడుపులపాయలో కుటుం బసభ్యులతో కలిసి వైఎస్సార్ కు నివాళులు అర్పించారు. అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన మహానేత రాజశేఖర్ రెడ్డి అని ఆమె అన్నారు. ఆయన పాలన తరతరాలకు ఆదర్శమని చెప్పారు.