-క్రైస్తవ సమాజం నుంచి షర్మిల బహిష్కరణ
-ఆమె బీజేపీ కోవర్టు అని క్రైస్తవ సంఘాల ఆరోపణ
-షర్మిలను క్రైస్తవ సమాజం నమ్మదని స్పష్టీకరణ
-షర్మిలపై కేసుల్లో బాధితులంతా క్రైస్తవులే
-ఆమె వెంట వెళ్లి తప్పుచేశామంటున్న క్రైస్తవనేతలు
-వెనక్కి వచ్చేస్తామంటూ క్రైస్తవ నేతలకు ఫోన్లు
-వారి పశ్చాత్తాపం నిజమేనన్న క్రైస్తవ నేత మత్తయ్య
-సర్కారు పథకాలను క్రైస్తవులకు దూరం చేసే కుట్ర అని విమర్శ
-బీఆర్‌ఎస్‌కే మద్దతు ప్రకటించిన క్రైస్తవ సంఘాలు
-బ్రదర్ అనిల్ డైరక్షన్‌లో పాదయాత్ర అని విమర్శలు
-ఇప్పుడు తిరగబడుతున్న అదే క్రైస్తవ సమాజం
-షర్మిల పాదయాత్రలో క్రైస్తవులే ఎక్కువ అని సర్కారుకు నిఘా నివేదిక
-పాస్టర్లు, ఫాదర్ల సౌజన్యంతోనే షర్మిల పాదయాత్ర చేస్తోందంటున్న బీఆర్‌ఎస్ వర్గాలు
-షర్మిల మత బహిష్కరణలతో కొత్త మలుపు తిరిగిన మత రాజకీయం
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)
ఒకప్పుడు తెలంగాణలో జగనన్న వదిలిన బాణమైన షర్మిల సంధిస్తున్న ‘క్రైస్తవ అస్త్రం’ గురి తప్పుతోందా? తెలంగాణలో క్రైస్తవ సమాజం దన్నుతో దూసుకువెళ్లాలన్న వ్యూహం బెడిసికొడుతోందా? షర్మిల వెంట ఉండి కేసులు నమోదైన క్రైస్తవ నేతలు పశ్చాత్తాపంతో వెనక్కివచ్చేస్తున్నారా? పాదయాత్రతో హల్‌చల్ చేస్తున్న ఆమెపై, సొంత క్రైస్తవ సమాజమే తిరుగుబాటు చేస్తోందా?షర్మిలను క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరించడమే అందుకు సంకేతాలా? తెలంగాణ క్రైస్తవ సమాజంలో తాజాగా తెరపైకొచ్చిన ఘటనలు చూస్తే వీటికి అవుననే సమాధానం ఇస్తున్నాయి.
వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల.. గత వారం నుంచి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. స్వయంగా ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి, పరామర్శించారంటే షర్మిల ప్రాధాన్యం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. షర్మిల కారులో ఉండగనే ఆ కారుతో సహా తీసుకువెళ్లిన పోలీసు యాక్షన్‌పై, షర్మిల రియాక్షన్ సంచలనం సృష్టించింది. పోలీసు చర్యకు నిరసనగా, షర్మిల తన ఇంటి వద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగడం చర్చనీయాంశమయింది. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసి, ఆసుపత్రికి తరలించడం తెలిసిందే.
అయితే.. షర్మిల పాదయాత్ర వల్ల, కేసీఆర్ ప్రభుత్వం తమకు ఇస్తున్న సంక్షేమపథకాలు నిలిపివేసే ప్రమాదం ఉందన్న ఆందోళన, క్రైస్తవ సమాజంలో మొదలయింది. చరిత్రలో తొలిసారిగా క్రైస్తవ భవన్ నిర్మించనున్న కేసీఆర్ సర్కారు, వారి పెదవులపై చిరునవ్వులు పూయించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి కిరణ్‌కుమార్ వరకూ క్రైస్తవభవన్ నిర్మించలేకపోవడమే దానికి కారణం. పైగా.. ప్రతి ఏటా క్రిస్మస్ కానుకలు ఇస్తున్న కేసీఆర్ సర్కారువైపు, క్రైస్తవ సమాజం సానుకూలంగా స్పందిస్తోంది.
ఈ నేపథ్యంలో క్రైస్తవురాలయిన షర్మిల చేస్తున్న పాదయాత్రలో.. కేసీఆర్‌పై ఆమె చేస్తున్న విమర్శలతో , క్రైస్తవ సమాజంలో ఆందోళన మొదలయింది. షర్మిల చేస్తున్న విమర్శల వల్ల.. కేసీఆర్ సర్కారు తమకు అమలుచేస్తున్న పథకాలు నిలిపివేసే ప్రమాదం ఉందన్నది, వారి అసలు ఆందోళన. కేసీఆర్‌తో షర్మిల యుద్ధం పతాకస్థాయికి చేరడంతో , క్రైస్తవ సమాజంలో ఆందోళన మరింత పెరిగింది.
ఫలితంగా తాము ఎటు వైపు ఉండాలన్న అంశంపై, ఒక స్పష్టతకు వచ్చిన క్రైస్తవ సమాజం.. హటాత్తుగా షర్మిలపై తిరుగుబాటుబావుటా ఎగురవేసింది.క్రైస్తవ సంఘాలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ, షర్మిల తీరుపై కన్నెర చేయడం ద్వారా.. ‘తాము ఆమె వెనుక లేమన్న’ సంకేతాలివ్వడం, క్రైస్తవ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, ఆమెకు ఫోన్ చేశారన్న వార్తలు కూడా.. క్రైస్తవ సమాజం, షర్మిల పట్ల అప్రమత్తం అయేందుకు మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల వెనుక కేవలం క్రైస్తవులే నడుస్తున్నారా? వారే ఆమె బలమా? ఆ మేరకు బ్రదర్ అనిల్ తెరవెనుక ఉండి షర్మిల పాదయాత్రను నడిపిస్తున్నారా?.. బీఆర్‌ఎస్ వర్గాలు వీటికి అవుననే సమాధానం ఇస్తున్నాయి. కారు ఘటనతో తెరపైకి వచ్చిన షర్మిల వైపు.. అన్ని వర్గాలు చూస్తున్న నేపథ్యంలో, ఆమెకు స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేశారన్న ప్రచారంతో, షర్మిల బీజేపీ విడిచిన బాణమేనన్న భావన తెలంగాణ రాజకీయ వర్గాల్లో స్థిరపడింది. ఇప్పుడు దానిని క్రైస్తవ సమాజం కూడా విశ్వసిస్తున్నట్లు క్రైస్తవ సంఘ నేతల మాటలు స్పష్టం చేస్తున్నాయి.
నిజానికి కాంగ్రెస్-బీజేపీ నేతలకు మించి.. కేసీఆర్ సర్కారును దునుమాడుతున్న షర్మిల పాదయాత్ర, పెద్దగా విజయవంతమయినట్లు కనిపించలేదు. కానీ కేసీఆర్ విమర్శలతో ప్రతిరోజూ పతాకశీర్షికలెక్కి, అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రధానంగా మేఘా కంపెనీపై ఆమె చేసిన ఆరోపణలు, సంచలనం సృష్టించాయి. కేసీఆర్ కుటుంబంతో, మేఘా కంపెనీకి ఉన్న వ్యాపారబంధంపై ఆమె లెక్కలేనన్ని ఆరోపణలు చేశారు.
రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌కు మేఘా కంపెనీ డబ్బులు ఇస్తున్నందుకే.. వారు మేఘాపై మాట్లాడటం లేదన్న షర్మిల ఆరోపణ, అటు వారు కూడా మేఘాపై మూనంగా ఉండటంతో షర్మిల ఆరోపణలకు బలం చేకూరింది. తెలంగాణ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని, ఆమె నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత షర్మిల పాదయాత్రపై నిఘా వేసిన కేసీఆర్ సర్కారుకు, అనేక ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. షర్మిల పాదయాత్రలో క్రైస్తవ మత పాస్టర్లు, ఫాదర్లు కీలకపాత్ర పోషిస్తున్నారట. షర్మిల వెళ్లే గ్రామాలకు చెందిన పాస్టర్లు, ఫాదర్లతో.. బ్రదర్ అనిల్ టీమ్, ముందస్తుగా మాట్లాడి అన్ని ఏర్పాట్లూ, అందులో భాగంగానే ఆయా గ్రామాలు, పరిసర గ్రామాలకు చెందిన క్రైస్తవులు, మతం మారిన దళితులు.. షర్మిల పాదయాత్రలో పాలుపంచుకుంటున్నట్లు, బీఆర్‌ఎస్ నాయకత్వానికి సమాచారం అందిందట.
షర్మిల పాదయాత్రలో వారి ‘రోజువారీ మంచిచెడ్డ’లన్నీ.. సంబంధిత పాస్టర్లు-ఫాదర్ల ద్వారా, బ్రదర్ అనిల్ టీమ్ చూసుకుంటున్న విషయాన్ని నిఘా వర్గాలు సేకరించినట్లు చెబుతున్నారు. తాజాగా షర్మిలపై నమోదైన కేసుల్లో కూడా క్రైస్తవ నేతలే ఎక్కువగా ఉన్నట్లు బీఆర్‌ఎస్ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. తెలంగాణలోని దళితుల్లో.. 60 శాతం మతం మారిన వారేనని బీఆర్‌ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. హిందూ సంస్థలు కూడా అదే విషయం చెబుతున్నాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కు, క్రైస్తవ సమాజంలో తిరుగులేని ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన రెండు తెలుగు రాష్ర్టాల్లో నిర్వహించే సువార్త కూటములకు, వేలాదిమంది క్రైస్తవులు హాజరవుతుంటారు.
గతంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి.. ఎన్నికల వరకూ, క్రైస్తవ సమాజాన్ని వైసీపీ బాట పట్టించడంలో, బ్రదర్ అనిల్‌దే కీలకపాత్ర అన్న విషయం బహిరంగమే. ఇప్పుడు ఆయన, తన భార్య షర్మిల పాదయాత్రకూ తెరవెనుక ఉండి, క్రైస్తవ సమాజాన్ని వినియోగించుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలకు అందిన సమాచారం బట్టి స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమయిన బీఆర్‌ఎస్.. షర్మిలకు ప్రధాని ఫోన్ చేసిన అంశాన్ని, సద్వినియోగం చేసుకోవడం ఆసక్తిగా మారింది. అందులో భాగంగా క్రైస్తవ సంఘాలను తెరమీదకు తీసుకురావడం ద్వారా.. షర్మిలకు క్రైస్తవ సమాజం మద్దతు లేదన్న సంకేతాలిప్పించడంతో, మతరాజీ యాలు కొత్త మలుపు తిరిగాయి.
తాజాగా భారత్ క్రిస్టియన్ కౌన్సిల్, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి నేతలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో, ‘షర్మిల.. ప్లీజ్ షటప్’అని హెచ్చరించడం చర్చనీయాంశమయింది. పైగా.. సుప్రీంకోర్టులో దళితులకు క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేది లేదన్న, బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపిన షర్మిల తమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్న ఆగ్రహం క్రైస్తవ సమాజంలో కట్టలు తెంచుకుంది.
ఫలితంగా షర్మిలను క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం, క్రైస్తవ సమాజంలో సంచలనం సృష్టించింది. ‘దళితులకు క్రైస్తవ హోదా ఇవ్వాలన్న తీర్మానం చేసిన వైఎస్ ఆత్మను క్షోభపెడుతున్నావు. క్రైస్తవం ముసుగులో బీజేపీకి ఊడిగం చేసే నిన్ను నమ్మేది లేద’ని.. క్రైస్తవ సంఘాలు కుండబద్దలు కొట్టడం, బ్రదర్ అనిల్ ప్రయత్నాలను సవాల్ చేసిన ట్టయింది. ఇది ఒక రకంగా బ్రదర్ అనిల్ ఇమేజీకి, భారీ డ్యామేజీనే అని క్రైస్తవ సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు.
మరో అడుగు ముందుకేసిన క్రైస్తవ సంఘాలు.. షర్మిల ఇంటిమీద ఉన్న శిలువ గుర్తు తొలగించి.. త్రిశూలం గుర్తు పెట్టుకుని, బీజేపీలో చేరాలంటూ చేసిన వ్యాఖ్యలు, క్రైస్తవ సమాజంలో కలకలం సృష్టిస్తున్నాయి. క్రైస్తవులు-దళిత క్రైస్తవుల ఓట్లు చీల్చి, బీజేపీకి ప్రయోజనం కల్పించడమే షర్మిల ధ్యేయమంటూ.. క్రైస్తవ సంఘాలు గత కొద్దిరోజుల నుంచీ, శరపరంపరగా విమర్శల వర్షం కురిపించడం అటు షర్మిలకూ ఇబ్బందికరంగా పరిణమించింది. తాము ఎవరినయితే నమ్ముకున్నామో, వారే తమకు ఎదురుతిరగడం సహజంగా షర్మిలకు షాక్‌నిచ్చేదే.
‘షర్మిల మనువాద బీజేపీతో చేతులు కలిపారన్న విషయం మోదీ ఫోన్‌తో క్రైస్తవ సమాజానికి అర్ధమయింది. ఆమె బీజేపీ వదిలిన బాణమే. తెలంగాణలో ప్రభుత్వం క్రైస్తవ భవన్ నిర్మిస్తోంది. అన్ని ప్రయోజనాలూ కల్పిస్తోంది. వాటిని క్రైస్తవులకు దూరం చేయడమే షర్మిల ధ్యేయం. అందుకే ఆమె బీజేపీతో చేతులు కలిపి, కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ పల్లకీ మోస్తున్న షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్‌కు క్రైస్తవ సమాజంలో చోటు లేదు. అందుకే ఆమెను క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరిస్తున్నాం’ అని క్రైస్తవ ధర్మప్రచార పరిరక్షణ సమితి చైర్మన్ జెరోసలేం మత్తయ్య, భారత క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ ప్రెసెడెంట్ బిషప్ భాస్కర్ స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా.. ఇటీవల షర్మిలతో పాటు కేసులు నమోదయిన వారిలో ఎక్కువమంది క్రైస్తవ నేతలే అని, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి చైర్మన్ జెరూసలేం మత్తయ్య వెల్లడించారు. ఇప్పుడు వారంతా తమ తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపంతో వెనక్కి వచ్చేస్తామని తమను సంప్రదిస్తున్నారని మత్తయ్య మరో బాంబు పేల్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. క్రైస్తవం నుంచి బహిష్కరణకు గురయిన షర్మిల, సొంత మతం వారికి మళ్లీ ఎలా దగ్గరవుతారో చూడాలి.