స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. సహచరులు, పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తానని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు రాజీనామా నిర్ణయం ఉపసంహరించుకుంటున్నట్నలు తెలిపారు. ఇక నుంచి నూతనోత్సాహంతో పార్టీ అధినేతగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పవార్ రాజీనామాను పార్టీ నియమించిన కమిటీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తన జీవిత చరిత్రపై మరాఠీలో రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా 1999లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో విభేదించి ఆయన ఎన్సీపీని స్థాపించారు. అప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.