స్వతంత్ర వెబ్ డెస్క్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో (Sports School) బాలికలపై లైంగిక వేధింపుల ఘటనను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. బాలికలపై వేధింపులకు పాల్పడుతున్న అధికారి హరికృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతాధికారులతో పూర్తిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) తెలిపారు.
మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి జైలుకు పంపిస్తామన్నారు. మహిళలను వేధిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అంతకుముందు స్పోర్ట్స్ స్కూల్ లో అరాచకాలపై బీఆర్ఎస్(Brs) ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదన్నారు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరారు.
కవిత ట్వీట్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు. దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వదని, అధికారులు, నేతలు ఎవరైనా ఊరుకునేది లేదన్నారు. విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.