స్వతంత్ర టీవీ, వెడ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై ప్రముఖ సినీ నిర్మాతలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకూ లేదని సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు నిర్మాత ఆది శేషగిరిరావు తెలిపారు.
దివంగత నటుడు కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నంది అవార్డులపై స్పందించారు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదని.. ఇప్పుడు ఆ అవార్డుకు విలువ లేకుండా పోయిందన్నారు.
ఇక మరో నిర్మాత అశ్వనీదత్ స్పందిస్తూ ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు అని.. ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తారని తెలిపారు. మరో రెండు మూడేళ్లలో సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. మరి నంది అవార్డుల గురించి సీనియర్ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.