స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అంటే… అంగట్లో రాష్ట్రాన్ని అమ్మడమేనని చెప్పారు. సంపదను సృష్టించాలి కానీ… ఆస్తులను అమ్ముకుంటూ పోతే వ్యవస్థలన్నీ కుప్పకూలుతాయని అన్నారు. వ్యవస్థల పతనానికి నాంది పలకడానికేనా కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివిందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలు కుమ్మక్కై భూములు పంచుకుంటున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 10 ఎకరాల భూమిని కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని… ప్రజలకు ఉపయోగపడే సైన్స్ సిటీకి భూమి ఇవ్వమంటే ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భూములు అమ్మితే మంత్రి కేటీఆర్ (KTR) వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే భూములు అమ్ముతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన భూములను అమ్ముకుంటూ పోవడం సరికాదని అన్నారు.