స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క నేడు (జులై 9) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. “ములుగు ఎమ్మెల్యే, నా సోదరి ఎమ్మెల్యే సీతక్కకు పుట్టినరోజు శుభకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను”అంటూ ట్వీట్ చేశారు. గిరిజనుల ,ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే మీ సేవాగుణం స్ఫూర్తిదాయకం అంటూ చంద్రబాబు సీతక్కకు కితాబిచ్చారు. అంతేకాదు ప్రజలే సర్వస్వంగా భావించే సీతక్క నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.
చంద్రబాబు ట్వీట్ పట్ల సీతక్క స్పందించారు. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ ఆత్మీయంగా బదులిచ్చారు. కాగా, సీతక్క ఈసారి అమెరికాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆమె అభిమానుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీతక్క యూట్యూబ్ లో పంచుకున్నారు.
గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన సీతక్క రేవంత్ రెడ్డి తో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నేటికీ అనేక సందర్భాల్లో సీతక్క చంద్రబాబుతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు సీతక్క. ఇక ఇటీవల సీతక్క తల్లి ఆసుపత్రిలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్లి ఆమె తల్లి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి పార్టీ మారిన టిడిపి అధినేత పట్ల అభిమానాన్ని సీతక్క, సీతక్క పట్ల ఆప్యాయతను చంద్రబాబు కనబరుస్తూ ఉండడం విశేషం. రాజకీయాల్లో ఇటువంటి ఔన్నత్యం ఉండటం నిజంగా అవసరం అని వీరిద్దరి బంధం స్పష్టం చేస్తుంది.


