తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి అనంతరం ఏడాది తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. జాహ్నవి మృతికి కారణమైన సియాటిల్ పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. గత ఏడాది తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
23 ఏళ్ల కందుల జాహ్నవి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన యువతి. గత ఏడాది జనవరి 23న సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న ఆమెను.. అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో జాహ్నవి వంద అడుగుల దూరంలో పడిపోయింది. ఆసమయంలో కెవిన్ 119 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నాడు.
సియాటెల్ టైమ్స్‌లోని నివేదిక ప్రకారం, సియాటెల్ డిపార్ట్‌మెంట్ నుండి డేవ్‌ను తొలగించినట్లు సియాటెల్ పోలీస్ చీఫ్ సూ రహర్ తెలిపారు.
ఉద్యోగులకు రహర్ పంపిన ఇ మెయిల్ ప్రకారం.. డేవ్ పోలీస్ నిబంధనలను ఉల్లంఘించాడని.. అందుకే అతనిని తొలగించినట్టు చెప్పారు.
జాహ్నవి ఘటనపై స్పందించిన రహర్.. ఆ రోజు రాత్రి ఎవరినీ చంపాలన్న ఉద్దేశం డేవ్‌కు లేదని.. వీలైనంత త్వరగా డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకున్న బాధితుడి దగ్గరకు వెళ్లే క్రమంలో ఇలా జరిగిందని తాను నమ్ముతున్నానని అన్నారు.
అయితే, అతని ప్రమాదకరమైన డ్రైవింగ్ వల్ల విషాదకరమైన పరిణామాలు చోటుచేసుకోవడం బాధాకరమని చెప్పారు. అతని ఉద్దేశం మంచిదే అయినా.. దాని వల్ల ఓ ప్రాణం పోవడంతో డిపార్ట్‌మెంట్‌కు అపఖ్యాతిని తెచ్చిపెట్టిందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
కందుల జాహ్నవి మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నవ్విన మరో సియాటెల్ పోలీసు అధికారి డేనియల్ ఆడెరర్‌ను సస్పెండ్ చేసిన నెలల రోజుల తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
గతేడాది సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన బాడీక్యామ్ ఫుటేజ్‌లో, రోడ్డు ప్రమాదం తర్వాత మరో పోలీసు అధకారి ఆడెరర్ నవ్వడం వినిపించింది. అంతేకాదు అతను జాహ్నవి మరణంపై చాలా హేళనగా మాట్లాడాడు. జాహ్నవి ఓ సాధారణ వ్యక్తి.. ఆమె మరణానికి విలువలేదని అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఆడెరర్ నాలుగు సెకన్ల పాటు గట్టిగా నవ్వాడు.
జాహ్నవి మృతిపై తమ డిపార్ట్మెంట్ అధికారి అడెరెర్ చేసిన వ్యాఖ్యలు మృతురాలి కుటుంబాన్ని తీవ్రంగా గాయపరచడమే కాదు సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చగా మారాయని సూ రహర్ చెప్పారు. ప్రజల కోసం పోలీసు అధికారులు అని.. వారి విశ్వాసం కోల్పోకూడదని చెప్పారు. కనుక తప్పని సరిగా పోలీసులు ఉన్నత ప్రమాణాలను పాటించాలి.. ఈ నేపథ్యంలో అడెరెర్‌ను పోలీసు అధికారిగా విధుల్లో కొనసాగించడం డిపార్ట్‌మెంట్‌కే అగౌరవమని చెప్పారు. అందుకే ఆయన్ని ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు.
అప్పట్లో జాహ్నావి కందుల మృతికి కారణమైన కెవిన్ డేవ్‌పై ఎలాంటి కేసు ఉండబోదని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. క్రిమినల్ ఆరోపణలతో ముందుకు వెళ్లబోమని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. కందుల జాహ్ని మృతి ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసేదే అయినా.. ఆమె యాక్సిడెంట్ కేసులో సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్‌కు వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు లేవని.. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండబోవని అన్నారు. సియాటెల్ అటార్నీ అతనిపై 5,000 అమెరికన్ డాలర్ల ట్రాఫిక్ ఉల్లంఘనను జారీ చేశారు.
సియాటెల్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కేసులో న్యాయపరమైన చర్యల కోసం అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తోంది. కందుల జాహ్నవి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారు. కందుల, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. కేసు పురోగతిని పర్యవేక్షిస్తూనే ఉంటామని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది.