స్వతంత్ర వెబ్ డెస్క్: నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. తెలంగాణలో ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే స్కూల్స్ తెరుచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ 2023, 24 విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని అధికారులు కొట్టిపరేశారు. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే జూన్ 12 నుంచి బడులు తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే కొన్ని సడలింపులు చేసింది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. జూన్ 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది ప్రభుత్వం. ఇక ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్య రాగి జావ అందించాలని ఆదేశించింది. ఉదయం 11.30 -12 గంటల మధ్య విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారిని ఇంటకి పంపించాలని సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.