వైఎస్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారాయన. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఉపరాష్ట్రపతికి రాజీనామా అందించానని చెప్పారు. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడానని.. ఆయనతో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానని చెప్పారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు విజయసాయి. తాను ఏ రోజూ అబద్ధాలు చెప్పలేదని.. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా అబద్ధాలు చెప్పనని అన్నారు. 4 దశాబ్దాలుగా వైఎస్ కుంటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. వైఎస్ కుటుంబంతో మూడు తరాలతో తనకు సంబంధాలు ఉన్నాయని వివరించారు.
“నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, ఏ సంస్థలోనూ భాగస్వామ్యాలు లేవు. నిరంతరం పార్టీ కోసమే నేను పనిచేశా. నా వియ్యంకుడు తన వ్యాపార లావాదేవీలు నాతో ఎప్పుడూ మాట్లాడరు. వాళ్ల వ్యాపారం ఏంటి?.. ఎన్ని యూనిట్లు ఉన్నాయనేది కూడా నాకు తెలియదు. దేవుడి సాక్షిగా చెబుతున్నా.. నా వియ్యంకుడి వ్యాపారాల గురించి నాకు తెలీదు. రాజకీయాల నుంచి తప్పుకుంటే నేను ఇంకా బలహీనుడిని అవుతా. రాజకీయాల నుంచి తప్పుకుంటే కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారు.
నేను అబద్ధం చెప్పను, నమ్మక ద్రోహం చేయను. వెన్నుపోటు లావాదేవీలు, వెన్నుపోటు రాజకీయాలు ఉండవు. కాకినాడ పోర్టు కేసులో నన్ను ఏ2గా చేర్చారు. కేవీ రావుతో నాకు ఎలాంటి పరిచయం లేదు. కేవీ రావుతో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు దగ్గరకు నేను పంపాను అనేది అవాస్తవం. నా పిల్లల సాక్షిగా చెప్తున్న కాకినాడ పోర్ట్ విషయంలో నాకు ఏ మాత్రం సంబంధం లేదు.
నా పదవికి న్యాయం చేయలేను అని భావించే రాజీనామా చేశా. నా మీద ఎలాంటి ఒత్తిడిలు లేవు. ఎవరితోనూ కేసులు మాఫీ చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటా, భయపడే తత్వం నాది కాదు. భయపడటం నా రక్తంలోనే లేదు. డబ్బులు తీసుకుని రాజీనామా చేసినట్టు ఏ ఒక్కరితోనైనా చెప్పించగలరా. విశాఖను విజయసాయి దోచేశారని ప్రచారం చేస్తున్నారు. విశాఖలో ఏ డీల్‌లోనూ నేను జోక్యం చేసుకోలేదు. నా కూతురు, అల్లుడి ఆస్తులు వారి స్వార్జితం. నా అల్లుడి వ్యాపారాలను నాకు ఆపాదిస్తే నేను ఏమీ చేయలేను. నాకు బెంగళూరులో ఇల్లు, విజయవాడలో ఇల్లు, విశాఖలో అపార్ట్‌మెంట్ మాత్రమే ఉంది. అంతకు మించి వేరే ఏ ఆస్తులూ నాకు లేవు. నా రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే తప్ప.. వైసీపీ కాదు.. వైపీకి 11 మంది బలం మాత్రమే ఉంది”.. అని విజయసాయిరెడ్డి చెప్పారు.