కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానంతో గులాబీ పార్టీ అలర్ట్ అయ్యింది. క్షేత్రస్థాయిలో బీసీ నినాదంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కసరత్తులు చేస్తోంది. కాంగ్రెస్ కు కౌంటర్ ఎలా ఇవ్వాలి…? బీసీ వర్గాలకు మరింత చేరువ ఎలా కావాలి అనే విషయంపై బిఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో బీఆర్ఎస్ బీసీ నేతలు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. బీసీల అంశంలో బిఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి…?
కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనపై సర్వే నిర్వహించింది. వివరాలను అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసింది. దీంతో బీసీ వర్గాలు కాంగ్రెస్ కు చేరువయ్యే అవకాశం ఉందని భావించిన గులాబీ అధిష్టానం అలర్టయ్యింది. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్వే రిపోర్టు తప్పుల తడక అని,లెక్కలతో వివరించేందుకు సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేసే నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2024 వరకు జనాభా 3 కోట్ల 84 లక్షలు,దాని ప్రకారం బీసీ ల జనాభా 56 శాతం ఉంటుందని గులాబీ పార్టీ అంటుంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కోట్ల 75 లక్షల జనాభా కు కులగణన పరిమితం చేసి, దాదాపు 40 లక్షల బీసీ జనాభా ను కనుమరుగు చేసిందని అంటోంది. బీసీల జనాభాను కేవలం 46.25 శాతం మాత్రమే చూపారని గులాబీ పార్టీ బీసీ నేతలు మండిపడుతున్నారు.
బీసీల కులగణనపై బిఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. రాబోయే స్థానిక సంస్థల్లో బీసీల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. అంతేగాకుండా 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుంటుంబ సర్వే వివరాల్లో బీసీ జనాభా వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళనున్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ
ప్రభుత్వంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్,రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించామని అంటోంది. ప్రస్తుతం గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మండలి ప్రతిపక్ష నేత, మండలి డిప్యూటీ చైర్మన్ గా ఇద్దరు బీసీ నేతలు ఉన్నారని బీసీలను తమకు ఓన్ చేసుకునే ప్రయత్నం గులాబీ పార్టీ చేస్తోంది.
అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన రిపోర్టును బిఆర్ఎస్ తప్పు పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చట్టం చేయకుండా పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం బీసీలను మోసం చేయడమే అని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు.ఇక బిఆర్ఎస్ పార్టీ తరఫున మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలోని బీసీ నేతల బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు.అక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో అనే దానిపై అధ్యయనం చేశారు.ఆ తర్వాత బీసీ నేతలతో కేసీఆర్ సమావేశం ఉంటుంది అనే చర్చ బిఆర్ఎస్ పార్టీలో జరిగింది. అయితే, బిఆర్ఎస్ బీసీ నేతలు సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం బీసీ నినాదంతో ముందుకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బిఆర్ఎస్ భావిస్తోంది.
తెలంగాణ వచ్చాక బిఆర్ఎస్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.రాష్ట్రంలో ఉన్న బీసీలు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది. 39 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లోను గులాబీ పార్టీకి మిగిలిన సామాజిక వర్గాలు దూరం కాగా బీసీలు అండగా నిలిచారు. దీంతో బీసీ ఓటు బ్యాంకు తమకు దూరం కాకుండా ఉండేందుకు బీసీ స్లోగన్ వినిపిస్తున్నట్లు బిఆర్ఎస్ వర్గాల్లో టాక్. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థ తరపున బీసీ సంఘాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కులగణన సర్వేపై బీసీల జనాభా తగ్గించి చూపారని ఆయా కుల సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా బీసీ కుల సంఘాల నేతలు చేసే ఆందోళనకు గులాబీ పార్టీ మద్దతు తెలిపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీసీ నినాదం గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.
————