స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు గల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమిక అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని కనిపెట్టడంతో పాటు బాధ్యులను కూడా గుర్తించామన్నారు. పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతానికి తమ దృష్టి అంతా పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. రైళ్ల రాకపోకలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే తమ ముందున్న కర్తవ్యమని వివరించారు. పట్టాలపై పడి ఉన్న మృతదేహాలన్నింటినీ తొలగించినట్లు తెలిపారు. కాగా బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందగా.. 1,175 మందికి పైగా గాయాలయ్యాయి.