స్వతంత్ర వెబ్ డెస్క్: హీరోగా, దర్శకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న రిషబ్ శెట్టి.. ప్రజలకు సేవ చేసే విషయంలోనూ అడుగులు వేస్తున్నారు. ఈ నెల 7న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బెంగళూరులో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ వేడుకల్లో రిషబ్ శెట్టి సతీమణి ప్రగతి శెట్టి కీలక ప్రకటన చేశారు. రిషబ్ శెట్టి ఫౌండేషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రగతి శెట్టి అనౌన్స్ చేశారు. విద్యా ప్రాముఖ్యతను చాటడానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. తన భర్తకు పుట్టినరోజు కానుకలు అందుకోవడం ఇష్టం ఉందని, నచ్చదని పేర్కొన్నారు. ”చాలా ఏళ్లుగా కర్ణాటకలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రిషబ్ శెట్టి సాయం చేస్తున్నారు. అయితే, ఆ విషయాన్ని ఆయన ఎప్పుడూ మీడియాతో పంచుకోలేదు” అని ప్రమోద్ శెట్టి తెలిపారు.
రిషబ్ శెట్టి పుట్టినరోజు వేడుకలు జరిగే సమయంలో వర్షం వచ్చింది. అయినా సరే అభిమానులు అలాగే నిలబడ్డారు. ఆ దృశ్యం చూసి రిషబ్ శెట్టి భావోద్వేగానికి లోనయ్యారు. కేవలం కర్ణాటక నుంచి మాత్రమే కాదు… మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు ఆయన్ను కలుసుకోవడానికి తరలి వచ్చారు. దాంతో నిజమైన అభిమానం అంటే ఇదేనని తెలిపిన రిషబ్ శెట్టి… వారితో ఆత్మీయంగా గడిపారు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ ”నా కోసం, నన్ను చూడటం కోసం అభిమానులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిలుచున్న తీరు నా మనసును తాకింది. మీ అంకిత భావం పట్ల గౌరవం పెరిగింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటాను. మీ రుణం తీర్చుకోలేనిది” అని రిషబ్ శెట్టి కృతఙ్ఞతలు తెలిపారు.
‘కాంతార’ విజయాన్ని కన్నడ ప్రేక్షకులకు రిషబ్ శెట్టి అంకితం ఇచ్చారు. హీరోగా తన ప్రయాణం, సినిమా విజయం గురించి ఆయన మాట్లాడుతూ ”పల్లెటూరి నుంచి కలలను మూట గట్టుకుని చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సాధారణ కుర్రాడిని నేను. నేడు అందరి ఆదరాభిమానాలు పొందినందుకు ఆనందంగా ఉన్నాను. కన్నడ ప్రేక్షకులు ఆదరించడం వల్లనే ‘కంతార’ గ్లోబల్ సినిమా అయ్యింది. నా అభిమానులకు, ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నా. ఈ రోజు, నా పుట్టినరోజు సందర్భంగా అది సాకారమైంది” అని ఫౌండేషన్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో టైగర్ డ్యాన్స్, ఛేడ్ ప్రోగ్రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదికపైకి వచ్చిన అభిమానులు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. ఇప్పుడు ‘కాంతార’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు.