స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలు మరోసారి కాంగ్రెస్ పాలనపై నజర్ వేసేలా చేసింది. తాజాగా, కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ చేసిన రేవంత్ అందులో 5 అంశాలు పొందుపరిచారు. మొదటిది ఉద్యమ అమరుల కుటుంబానికి నెలకు రూ.25వేల పెన్షన్.. రెండవది అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. మూడవది నిరుద్యోగులకు నెలకు రూ.4000 వేల భృతి.. నాలుగవది ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కడం.. ఐదవది నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు.
ప్రత్యేకించి ఐదు అంశాలను పొందుపరిచిన రేవంత్.. అమరవీరుల త్యాగాలను గుర్తుచేశాడు. వారికి తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనలతో యూత్ డిక్లరేషన్ లో మొదటి స్థానాన్ని కల్పించారు. అమరవీరుల త్యాగం వల్ల సిద్దించిన తెలంగాణ.. వారికీ ప్రతిఫలం తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. ఎన్ని చేసినా కూడా అమరవీరుల ఋణం తీర్చుకోలేనిది అని అన్నారు.


