స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ తప్ప కర్ణాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ పార్టీ గెలుపుపై సానుకూలంగా స్పందించారన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో జత కట్టాల్సిన అవసరం ఉందని మమతా చెప్పిన సంగతిని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ మాత్రం కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించలేదని మండిపడ్డారు. కన్నడ ప్రజలు ప్రజస్వామ్యాన్ని కాపాడారని కేసీఆర్ ఒక్క మాట అని ఉంటే ఆయన్ను అభినందించేవారని పేర్కొన్నారు.
కర్ణాటక ఫలితాలను పెద్దగా పట్టించుకోవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన మాటలనే కేసీఆర్ కూడా చెప్పారని విమర్శించారు. దీనిని బట్టి చూస్తుంటే బీజేపీని కేసీఆర్ సమర్థిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. మోదీపై కొట్లాడతానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యవహారశైలి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ సూచించారు.