28.2 C
Hyderabad
Saturday, March 2, 2024
spot_img

రేవంత్ మార్క్ రూలింగ్..!

రేవంత్ రెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. ప్రజాక్షేత్రంలో ఎంతో దూకుడుగా వ్యవహరించే ఆయన.. టీపీసీసీ చీఫ్‌గా అనేక ప్రజా సమస్యలపై గళమెత్తారు. హస్తం పార్టీని పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ముఖ్యమంత్రిగా రేవంత్ ఎలా ముందుకెళతారు ? మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండి దూకుడు ప్రదర్శించిన ఆయన… అభివృద్ధి, సంక్షేమం సహా ఇతర అంశాలను ఎలా పరుగులు పెట్టిస్తారు ? మాది ప్రజా ప్రభుత్వం అంటున్న ఆయన.. అసలు ఏం చేస్తారు? ఎలా చేస్తారు…? అన్న ప్రశ్నలు తొలి రోజునే తలెత్తాయి. అయితే.. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా కాలేదు కానీ, అప్పుడే పాలనలో రేవంత్ మార్కు స్పష్టంగా కన్పిస్తోందన్న టాక్ మొదలైంది.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన ఇనుప కంచెల్ని తొలగించారు. నాటి పాలకుల అహంకారానికి చిహ్నంగా నిలిచిన గడీలు బద్దలు కొట్టామంటూ ప్రమాణ స్వీకార వేదిక సాక్షిగా గర్జించారు. అదే సమయంలో ప్రగతి భవన్‌కు మహాత్ముడైన జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌ అని పేరు మార్చి తన మార్కు పాలన మొదలైందన్నసంకేతాలిచ్చారు.

మాది ప్రజా ప్రభుత్వమంటూ తాను చెప్పిన మాటల్ని నిజం చేసేందుకు.. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజా దర్బార్ నిర్వహించి జనం గోడు వినటం ప్రారంభించారు. వారి కష్టాలు, సమస్యలు చెప్పుకునేందుకు, వాటిని పరిష్కరించేందుకు ప్రజా భవన్‌ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న నమ్మకాన్ని జనంలో పెంచే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి.

ఇక, ముఖ్యమంత్రిగా శాఖా పరమైన రివ్యూలను చేయడం ప్రారంభించారు సీఎం. ప్రత్యేకించి ప్రచార పర్వంలో రాష్ట్రమంతటా అత్యంత కీలకంగా మారిన విద్యుత్‌పై లోతుగా అధికారులతో చర్చించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎండీగా పనిచేసిన ప్రభాకర్‌ రావు ద్వారా అసలు.. విద్యుత్ వ్యవస్థలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయాలని భావించారు. కానీ, ఆయన సమీక్షకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి… మొత్తం విద్యుత్ వ్యవస్థనే ప్రక్షాళించాలని భావించారు. తాజాగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో అదే విషయం ప్రతిబింబిండం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏంటనే విషయం వ్యవస్థలోకి సూటిగా వెళ్లింది.

కేవలం ఇదే కాదు.. వరుసగా పలు శాఖలపై చేస్తున్న సమీక్షలతో… ఇప్పటికే నాలుగున్నర లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ? ఎక్కడ వృధా అరికట్టాలి ? నిధుల సమీకరణ ఎలా అనే అంశాలపై లోతైన అవగాహనకు వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే తనవైపు నుంచీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారాయన. ప్రభుత్వ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి… ప్రజా భవన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించారు. ఇందులో ఉన్న మరో భవనాన్ని ఇంకో మంత్రికి కేటాయిస్తామన్నారు. ఇక, తన వంతు వచ్చే సరికి .. తన క్యాంప్ ఆఫీసు కోసం ఎలాంటి ఆడంబరాలకు, ఖర్చుకు పోవద్దని నిర్ణయించారు సీఎం. MHRDలో మిగిలిన ఖాళీస్థలంలో ఓ షెడ్ వేసుకుంటానని.. తద్వారా భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, కొత్త ప్రభుత్వం వచ్చింది కదాని, నూతన వాహనాలను కొనేది లేదంటూ తేల్చి చెప్పేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతి విషయంలోనూ దృష్టిలో పెట్టుకొని దుబారాలను సహించబోమని తెలిపారు. అదే సమయంలో మహాలక్ష్మి పథకం, ఉచిత విద్యుత్ సహా పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కొంత మేర నిధులు విడుదల చేసేలా చూశారు. ఇదే విషయాన్నిగవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించి ప్రజల్లోకి తమ పాలనా ప్రాధాన్యాలను మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఇక, పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. నూతన అసెంబ్లీ నిర్మాణం మాత్రం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా అని, నూతన భవనాల నిర్మాణం చేపట్టేది లేదంటూ సంకేతాలిచ్చారు. పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో కౌన్సిల్ సమావేశాలు, ఇప్పుడున్న అసెంబ్లీలో శాసనసభ జరుగుతుందని ప్రకటించారు. అంతేకాదు… గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల విషయంలోనూ కఠినంగా ఉండడం మొదలు పెట్టారు. ప్రత్యేకించి మెట్రో వ్యవహారం ఇందులో ఒకటి. రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించాలని భావించిన ప్రాజెక్టు ఉపయోగం లేదని తేల్చిచెప్పారు. అందుకు భిన్నంగా ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట మీదుగా లేదంటే.. ఎంజీబీఎస్, ఫలక్‌నుమా మీదుగా మెట్రోను విమానాశ్రయానికి తీసుకెళ్లే అంశాన్ని పరిశీలించాలంటూ అధికారలకు ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వ అలైన్‌మెంట్, లెక్కల ప్రకారం రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి వెళ్లే మెట్రోకు ఆరువేల కోట్లకుపైగా ఖర్చవుతుందని తేలగా.. ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నాలుగు నుంచి నాలుగున్నర వేల కోట్ల లోపులేనే ఖర్చు ఉంటుందని భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని తగ్గించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాదు..కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కారు.

మొత్తంగా చూస్తే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో దూకుడుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా సైతం పాలనలోనూ తనదైన ముద్రను వేస్తుండడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిరేపుతోంది.

Latest Articles

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్