ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లి త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. అనంతరం తిరుగు పయనంలో ఈ ప్రమాదం జరిగింది.
జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన వాహనం నంబరు AP29 W 1525గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.