ఎన్టీఆర్ వర్థంతి వేళ ఎంతో ముఖ్యమైన వాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. తెలంగాణలో త్వరలోనే టీడీపీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నారా లోకేష్ చెప్పడంతో రాష్ట్రంలోని తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లలో ఎక్కడ లేని జోష్ తీసుకొచ్చారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీలో ఇప్పటికే కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న టీడీపీని రాష్ట్రంలోనూ బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని స్వయంగా చెప్పడమే ఇందుకు కారణం.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అంటే కేవలం మూడు అక్షరాలు కాదు.. అదో ప్రభంజనంగా అభివర్ణించారు. సినీ పరిశ్రమలోనే కాదు.. రాజకీయాల్లోనూ ఆయన తన మార్క్ చూపించారని అన్నారు మంత్రి నారా లోకేష్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కిలో రెండు రూపాయలకే బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్‌ది అన్నారు మంత్రి లోకేష్. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తిగా చెప్పుకొచ్చారు. గతంలో తెలుగు వారంటే మద్రాసీలని అనేవారని.. అలాంటి వేళ తెలుగు ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేయడంలో ఎన్టీఆర్ కృషి ఎంతో ఉందన్నారు మంత్రి నారా లోకేష్.
ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో పార్టీ పెట్టారని.. ఆయన ఆశయాల మేరకే పార్టీని ముందుకు తీసుకువెళతామన్నారు లోకేష్. అంతేకాదు.. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి లోకేష్. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా లక్షా 60 వేల మంది ప్రజలు స్వచ్చంధంగా సభ్యత్వాలు తీసుకున్నారని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్.
లోకేష్ చేసిన ఈ కామెంట్లతో తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉంది టీడీపీ. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అప్పుడప్పుడూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చి వెళుతున్నారు. పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో తీగల కృష్ణారెడ్డి సహా పలువురు లీడర్లు సైతం తెలుగుదేశం పార్టీకి జైకొట్టారు. ఇలాంటి వేళ లోకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.