తెలిసి చేశారా.. లేదంటే తెలియక చేశారా..? అసలు ఎందుకలా చేశారు…? ఇలా ఒకటీ రెండూ కాదు ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అభిప్రాయాలు.. సాధారణ ఫ్యాన్స్ మొదలు సనాతన ధర్మం గురించి విపులంగా చెప్పే వాళ్ల వరకు అందరి నోటా ఇదే మాట. అవును.. నటుడు రామ్‌చరణ్ కడప పెద్ద దర్గా పర్యటన ఇప్పుడు పెను వివాదంగా మారింది.
నిజానికి కడప పెద్ద దర్గాకు ఏ మతం వారైనా వెళ్లిరావచ్చు. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు లేవు. ఎందుకంటే ఎవరి నమ్మకం, ఎవరి భక్తి వారిది. ఎవరి విశ్వాసాలు వాళ్లవి. కానీ, ఇందుకు భిన్నంగా రామ్‌చరణ్ వ్యవహరించడంతోనే వివాదం మొదలైంది. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న రామ్‌చరణ్.. ఇటీవలె కడపలోని పెద దర్గాకు వెళ్లారు. అక్కడ ఉన్న దర్శాను సందర్శించారు. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉన్న రామ్‌చరణ్.. దర్గాకు వెళ్లడమేంటని ఆయన ఫ్యాన్సే కాదు.. సనాతన ధర్మం గురించి చెప్పేవాళ్లు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే దర్గా అంటే పవిత్రమైన సమాధి అని అర్థం. అదే సమయంలో పరమ పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి సమాధి వద్దకు వెళ్లడమేంటన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
అయితే.. రామ్‌చరణ్ మాత్రం కడప పెద్ద దర్గా సందర్శనపై స్పందించాడు. గతంలో రెహమాన్‌కు మాట ఇచ్చానని.. అందుకే అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ పెద్ద దర్గా సందర్శనకు వచ్చానన్నాడు. కానీ, దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతగా వెళ్లాలనుకుంటే, మాట నిలుపుకోవాలనుకుంటే అయ్యప్ప మాల తీసి వెళితే సరిపోతుంది కదాని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో రామ్‌చరణ్ చెబితే.. రెహమాన్ తిరుమల పర్యటనకు వస్తారా అంటూ మరికొందరు ఫైరవుతున్నారు. హీరో రామ్‌చరణ్ దర్గాను సందర్శించడంపై స్పందించారు రాధామోహన్ దాస్. ఎవరూ పూర్తి జ్ఞానులు కారన్నారు. ఈ విషయంపై ఆయన్ను కూర్చోబెట్టి మాట్లాడదామన్నారు. అసలు కడపలో ఉన్నది దర్గా కాదని.. వెంటేశ్వర స్వామి గుడి అని వ్యాఖ్యానించారు రాధామోహన్ దాస్.