స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో బాధితులకు అందే బీమా సదుపాయం గురించి ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారతీయ రైల్వేశాఖ ప్రతి ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోందని మీకు తెలుసా? అది కూడా కేవలం రూపాయి కన్నా తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఈ విషయం తెలియక చాలా మంది పరిహారాన్ని పొందలేకపోతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందనుంది.
వెబ్‌సైటులో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోడానికి ఒక బాక్స్ వస్తుంది. అందులో టిక్కు పెడితే.. బీమా కోసం రూ.35పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన వెంటనే మీ ఫోన్, ఈ-మెయిల్‌కు బీమా కంపెనీకి సంబంధించిన ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి నామినీ వివరాలు కచ్చితంగా పొందుపరచాలి. నామినీ వివరాలు అందించకపోతే బీమా దరఖాస్తుకు వీలుండదు.
బీమా తీసుకున్న ప్రయాణికులు దురదృష్టవశాత్తు రైలు ప్రమాదంలో మరణిస్తే.. వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10,000 కూడా బీమా సంస్థ అందిస్తుంది. ప్రమాదంలో మృతిచెందినా లేదా శాశ్వతంగా అంగ వైకల్యం ఏర్పడినా రూ.10 లక్షల పరిహారం అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షలు.. క్షతగాత్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2లక్షలు అందిస్తారు.
బీమా పొందాలంటే నామినీగా ఉన్న వ్యక్తి తగిన పత్రాలు తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. అధికారులు అన్ని పత్రాలను సరిచూసుకున్నాక నాలుగు నెలల్లోపు బాధితులకు బీమా సొమ్ము ఇస్తారు. ఈ విషయం తెలియక చాలా మంది ఈ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇప్పటికైనా ఇక నుంచి రైల్వే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు రూ.35పైసలు చెల్లించి బీమా సదుపాయం పొందండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మీ కుటుంబానికి ఆ బీమా డబ్బులు అండగా ఉంటాయని గుర్తుంచుకోండి.