బడ్జెట్ సందర్భంగా చేపట్టే హల్వా వేడుకలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అధికారులపై వివక్ష చూపించారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హల్వా వేడుకలో పాల్గొన్న 20మంది అధికారులలో కేవలం ఇద్దరు మాత్రమే దేశంలోని 95శాతం ప్రజానీకానికి చెందినవారు ఉన్నారని చెప్పారు. వారిలో ఒక్కరు మైనార్టీ కాగా.. మరొకరు ఓబీసీ వర్గానికి చెందిన వారిన తెలిపారు. ఆ ఇద్దరు కూడా హల్వా వేడుక పోస్టర్‌లో వెనుక భాగాన ఉన్నారని.. వారిని ముందుకు రానివ్వలేదని విమర్శించారు.
దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలు దేశంలో 73శాతం ఉన్నారని రాహుల్ అన్నారు. వారికి ఏ రంగంలో కూడా అవకాశం దొరకడం లేదని తెలిపారు. బిజినెస్, పాలిటిక్స్, కార్పొరేట్ సెక్టార్లో ఎక్కడా వారికి సరైన స్థానం కల్పించడం లేదని అన్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్‌కు ముందు ఆర్థిక శాఖ అధికారులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా తింటున్న ఫొటోను రాహుల్ సభలో ప్రదర్శించారు. ప్లకార్డును టీవీలో చూపించకుండా అడ్డుకోవడంపై రాహుల్ అసహనం వ్యక్తం చేశారు.