ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత మరోసారి ఈ కేసుపై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు ప్రశ్నలు వేశారు.
ఏసీబీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తనకున్న అవగాహన మేరకు ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. ఏసీబీకి పూర్తిస్థాయిలో విచారణకు సహకరించానని అన్నారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని చెప్పానని అన్నారు. ఈ కేసులో పస లేదన్నారు.
రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా ప్రశ్నించారని కేటీఆర్ చెప్పారు. ఇందులో కొత్తగా వారు అడిగిందేమీ లేదన్నారు. డబ్బు వాళ్లకు ముట్టింది.. ఇక్కడి నుంచి పంపించాము.. ఇందులో అవినీతి ఎక్కడుంది.. అని ప్రశ్నించానని చెప్పారు.
మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్‌ను అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఇది మీడియా పాయింట్ కాదని.. తెలంగాణ భవన్‌లో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మాట్లాడితే వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. మీడియా మీద దాడి ఎందుకని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతుంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు కేటీఆర్.