కుటుంబ వివాదాల నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ని కలిశారు. ఆస్తుల విషయంలో నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే మనోజ్‌పై తన తండ్రి మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు హజరయ్యాడు మనోజ్. ఈ విచారణలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల గురించి మనోజ్ వివరించాడు.
జల్‌పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని.. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ.. కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు జిల్లా మేజిస్ట్రేట్‌ని ఆశ్రయించారు. అయితే మోహన్ బాబు ఫిర్యాదు మేరకు జల్‌పల్లిలో నివాసం ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. దీంతో ఈ ఫిర్యాదుకు సంబంధించి మంచు మనోజ్ కలెక్టర్ ముందు విచారణకు హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్.. తన అన్న కారణంగానే గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఆస్తిపై తమ కుటుంబ సభ్యులందరికీ హక్కు ఉంటుందన్నారు. విచారణ కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. తన న్యాయపోరాటం కొనసాగుతుందని వివరించారు. కుటుంబ సభ్యులందరం కూర్చొని మాట్లాడుకుందామని రమ్మని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ రావడం లేదని అన్నారు. జల్ పల్లిలో తన పాప ఇంట్లో ఉందని చెప్పినా పంపకపోవడంతోనే గొడవలు జరగాయని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటాన్ని కొనసాగిస్తానని మంచు మనోజ్ తేల్చి చెప్పారు.
మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్
మంచు కుటుంబం వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జల్‌పల్లి నివాసం నుంచి మనోజ్‌ను ఖాళీ చేయించాలని కోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు చెందే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జల్‌పల్లి నివాసంతో పాటు తన ఆస్తులలో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని.. తన స్వార్జిత ఆస్తులలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి.. తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు.
గత కొన్ని రోజులుగా మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నారు. జల్‌పల్లి ఇంట్లో మంచు మనోజ్ ఉంటున్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్.. పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నారు. జల్‌పల్లి ఇంట్లో ఉంటున్న మంచు మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు.


