కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద ఫైనాన్స్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నైరోబిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో పలువురు నిరసనకారులు మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు.
పార్లమెంటు భవనం ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులపై భద్రతా బలగాలు లాఠీఛార్జ్‌తోపాటు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులు, వంట నూనె, ఉద్యోగుల వేతనాలు, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం ద్రవ్య బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కొత్త ఫైనాన్స్ బిల్లును ఆమోదించవద్దని ప్రజాప్రతినిధులను కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఆందోళనలు ఉద్ధృత రూపం దాల్చడంతో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హై కమిషన్ సూచించింది.


