ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పని చేసే చోట కనీస సౌక ర్యాలు లేక, సమయానికి కూలీ డబ్బులు రాక, నిబంధనల ప్రకారం అధికారులు నడుకోక నానా తిప్పలు పడుతున్నారు అక్కడి జనం.
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నత్తనడకన కొనసాగుతున్నాయి. వేసవిలో పని దొరక్క ఇబ్బందులు ఎదుర్కొనే పేదల వారికి ఈ పథకం ద్వారా 100 రోజుల పని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే కొన్ని గ్రామాల్లో ఇది జరగడం లేదు. 100 రోజుల పూర్తి పనిదినాలను కల్పించడం లేదు. మరోపక్క వచ్చిన కూలీ డబ్బుల నుంచి కమిషన్ల రూపంలో అధికారులు నొక్కేస్తున్నారన్న ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కూలీలది. అలాంటిది సమయా నికి డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు ఉపాధి హామీ కూలీలు. నాలుగు నెలలుగా ఇదే పరిస్థితితో అల్లాడిపోతున్నామంటున్నారు.
ఇక మరోవైపు పని చేసే చోట సరిమైన సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు ఉపాధి హామీ కూలీలు. వేసవికాలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు పనులు ముగించుకొని తిరిగి ఇంటికి రావాలని. కానీ దగ్గరలో పనులు లేకపోవడంతో దూరాన కాలినడకతో వెళ్లి పని ముగించుకుని తిరిగి వచ్చే సరికి మధ్యాహ్నమవుతోంది. దీంతో ఎండ వేడికి వడదెబ్బతో హాస్పటల్ పాలవుతున్నారు కూలీలు. ఉపాధి పథకం నిబంధనల ప్రకారం పనిచేసే స్థలాల వద్ద నీడ కోసం టెంట్లు, నీటి వసతి, ప్రథమ చికిత్స సదుపాయాలు కల్పించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కూలీల ప్రాణాల మీదుకు తెస్తు న్నారు. రెండేళ్ల క్రితం కూలీలకు నీడనిచ్చి రక్షణకు ఉండేందుకు టార్పలిన్ కవర్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు వాటి జాడే లేదు. దీంతో కూలీలు భోజనాలు ఎండలోనే చేయాల్సి వస్తోంది. ఇక నీటి సౌకర్యం లేకపోవడంతో దాహంతో అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు తమ గోడును పట్టించుకుని పని చేసే చోట సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అలాగే పని దొరకని కాలంలో తమకు 100 రోజలు తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని, సకాలంలో కూలీ డబ్బులు చెల్లించా లని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూలీల నుంచి కమిషన్లు దండుకునే వారిపై దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


