భారత ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారైంది. మాస్కో అధ్యక్షతన వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గోనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. రష్యాలోని కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోదీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈనెల 22 నుంచి 23 వరకు మోదీ రష్యాలో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరవుతారని ఆ దేశ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు.