చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. సాంకేతికత, అత్యాధునిక హంగులతో రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్ 28న ఈ టెర్మినల్ ప్రారంభించాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.
ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశ రవాణా రంగంలో సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ, దేశం ఇప్పుడు 1,000 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అధిగమించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇటీవల నమో భారత్ రైలు ప్రారంభోత్సవం , రాజధానిలో మెట్రో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాన్ని కూడా ప్రధాన మంత్రి హైలైట్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. చర్లపల్లి టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరిగిందన్నారు మోదీ. రైల్వే రంగంలో మౌలిక సదుపాయలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆధునీకరణతో పాలు ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగణకు డ్రైపోర్టు ఇవ్వాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో రైలు విస్తరణకు తోడ్పాటు అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తమకు సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు.
కొత్త జమ్మూ రైల్వే డివిజన్‌తో పాటు తెలంగాణలో చర్లపల్లి కొత్త టెర్మినల్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులలో ముఖ్యమైనవి. అదనంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలు దేశంలోని ఉత్తరం, తూర్పు, దక్షిణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా ఆధునిక కనెక్టివిటీలో ఒక పెద్ద పురోగతిని సూచిస్తాయి.